♦జెండా ఊపి ప్రారంభించిన యర్రగొండపాలెం టీడీపీ ఇన్‌ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు
♦పాల్గొన్న మండల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు
స్వస్తిక్ న్యూస్,త్రిపురాంతకం :- పల్లెల పరిశుభ్రతే లక్ష్యంగా, పర్యావరణ పరిరక్షణ కోసం త్రిపురాంతకం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 'స్వచ్ఛ రథాన్ని' యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య మెరుగుదల, తడి-పొడి చెత్త సేకరణ, అలాగే ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించే దిశగా ఈ స్వచ్ఛ రథం నిరంతరం సేవలు అందించనుంది. ఈ సందర్భంగా రథాన్ని పరిశీలించిన శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామాలు శుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, రాష్ట్రంలో కొలువుదీరిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం పారిశుధ్యానికి, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు.

ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వీధుల్లో వేయకుండా ప్రతిరోజూ వచ్చే ఈ స్వచ్ఛ రథానికే అందించాలని ఆయన స్థానిక ప్రజలకు పిలుపునిచ్చారు. త్రిపురాంతకం మండలాన్ని ప్లాస్టిక్ రహిత, ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధికారులతో పాటు ప్రజలందరిపై ఉందన్నారు.ఈ అధికారిక కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు చురుగ్గా పాల్గొన్నారు. త్రిపురాంతకం మండల తహశీల్దార్ (MRO) , మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) మాట్లాడుతూ... మండల వ్యాప్తంగా పారిశుధ్య నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల సహకారంతో గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యదర్శి, స్వర్ణ గ్రామ సచివాలయ సిబ్బందితో పాటు కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) పార్టీల ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.