స్వస్తిక్ న్యూస్,యర్రగొండపాలెం :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులతో ప్రత్యక్ష అనుసంధానం ఏర్పరచుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకొని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “రైతన్న మీకోసం వారోత్సవాలు” కార్యక్రమం ఈ నెల 16, 17, 18 మరియు 23, 24, 25 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమలు చేయనున్నారు. రైతుల సమస్యలు తెలుసుకోవడం, ప్రభుత్వ పథకాలను వారికి మరింత చేరువ చేయడం, వ్యవసాయ అభివృద్ధికి అవసరమైన సూచనలు సేకరించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించింది.

ఈ నేపథ్యంలో యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు తన క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ప్రతి రైతు వద్దకు చేరుకొని వారి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి తెలియజేయడం ద్వారా రైతులకు మేలు చేకూర్చాలని ఆయన సూచించారు.