స్వస్తిక్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనాభా పెంపును ప్రోత్సహించే దిశగా కీలక ప్రకటన చేశారు. పిల్లలు అంటే భారం కాదని, వారే దేశానికి నిజమైన సంపద అని ఆయన అభివర్ణించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం.. ఎక్కువ మంది పిల్లలను కనే దంపతులకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తామని వెల్లడించారు. ఎవరికైనా మూడో బిడ్డ పుడితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.30 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అలాగే, నాలుగో బిడ్డ పుడితే ఆ మొత్తాన్ని రూ.40 వేలుగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సరికొత్త ప్రోత్సాహకాలకు సంబంధించిన పూర్తి విధివిధానాలను త్వరలోనే రూపొందించి, ప్రజల ముందుకు తీసుకువస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సీఎం ఈ ప్రకటన చేయగానే సభకు హాజరైన ప్రజలంతా కేకలు వేస్తూ తమ హర్షం వ్యక్తం చేశారు.
ఇదే సభలో సీఎం చంద్రబాబు విద్యార్థుల తల్లులకు అందించే 'తల్లికి వందనం' పథకం గురించి కూడా ప్రస్తావించారు. దేవుడు కరుణించి (రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరిస్తే), ప్రస్తుతం ఈ పథకం కింద ఇస్తున్న రూ.15 వేల ఆర్థిక సాయాన్ని కూడా భవిష్యత్తులో మరింత పెంచడానికి తమ ప్రభుత్వం తప్పకుండా ప్రయత్నిస్తుందని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు.