స్వస్తిక్ న్యూస్, త్రిపురాంతకం :- త్రిపురాంతకం మండలంలోని పాత అన్న సముద్రం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పసుపులేటి వెంకట చంద్రశేఖర్ అనే యువకుడు ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం... ఈరోజు మధ్యాహ్నం సుమారు ఒంటిగంట సమయంలో వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్ నడుపుతున్న సమయంలో అదుపుతప్పి సమీపంలోని కాలువలోకి బోల్తా పడింది. డ్రైవింగ్ సరిగా చేయలేకపోవడం వల్ల ట్రాక్టర్ ఒరిగిపోయి బాలుడు ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

ప్రమాదాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ట్రాక్టర్‌ను పైకి లేపి బాలుడిని బయటికి తీశారు. అయితే అప్పటికే అతను మృతిచెందినట్లు తెలిసింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వ్యవసాయ పనుల సమయంలో సరైన జాగ్రత్తలు పాటించాలని, అనుభవం లేని వారు వాహనాలు నడపరాదని అధికారులు సూచిస్తున్నారు.