స్వస్తిక్ న్యూస్, సినిమా:- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించి వైరల్ అవుతున్న ఒక పోస్టర్/లుక్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. సినిమా నుంచి ఏదో ఒక అదిరిపోయే అప్‌డేట్ వస్తుందని ఆశించిన ఫ్యాన్స్‌కు, ప్రస్తుతం కనిపిస్తున్న అల్లు అర్జున్ లుక్ మింగుడు పడటం లేదు. ఈ గెటప్‌పై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.
ఓనిడా దయ్యంలా ఉందంటూ కామెంట్స్:- ముప్పై ఏళ్ల క్రితం టీవీ ప్రకటనల్లో పాపులర్ అయిన 'Onida TV Devil' గెటప్‌ను ఈ లుక్ తలపిస్తోందని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. 'పుష్ప' సిరీస్‌లో మాస్ లుక్‌లో చూసి బోర్ కొట్టిన అభిమానులు, తమ హీరోను మళ్ళీ పాత 'స్టైలిష్ స్టార్' గెటప్‌లో చూడాలని ఆశపడుతున్నారు. అట్లీ సినిమాలోనైనా బన్నీ క్లాస్ అండ్ స్టైలిష్‌గా కనిపిస్తారని ఊహిస్తే, ఈ వింత గెటప్ ఏంటని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దర్శకుడికి విన్నపం:- "అట్లీ గారూ.. మా స్టైలిష్ స్టార్‌ను కాస్త స్టైలిష్‌గానే చూపించండి ప్లీజ్" అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు దర్శకుడిని కోరుతున్నారు.సినిమాలో అల్లు అర్జున్ ఎన్ని గెటప్‌లలో కనిపిస్తారో, అసలు ఈ లుక్ వెనుక ఉన్న కథ ఏంటో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
