స్వస్తిక్ న్యూస్,హైదరాబాద్:- పెళ్లి సందడి మళ్లీ మొదలైంది, కానీ ఈసారి శుభ ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి. పండితులు చెబుతున్న దాని ప్రకారం, జూలై నెలలో కేవలం కొన్ని రోజులు మాత్రమే వివాహాది శుభకార్యాలకు అనుకూలంగా ఉన్నాయి.
ముహూర్తాలు ఉన్న తేదీలు ఇవే:- పంచాంగ కర్తలు, పురోహితులు తెలిపిన వివరాల ప్రకారం... జూలై 1, 2, 3, 4, 5, 8, మరియు 9వ తేదీలలో మాత్రమే బలమైన శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఈ తేదీలలో ఎవరైతే పెళ్లి, గృహప్రవేశం లాంటి శుభకార్యాలు చేసుకోవాలని అనుకుంటున్నారో, వారికి ఇది చాలా మంచి సమయం. ఈ కొన్ని తేదీల తర్వాత, ఆషాఢ మాసం మరియు గురు మూఢం ప్రభావం మొదలవుతుంది. ఇందువల్ల చాలా రోజుల పాటు ముహూర్తాలు లేవు. సుమారుగా ఆగస్టు 15 వరకు ఎలాంటి శుభకార్యాలు చేయడానికి అనుకూలమైన సమయం లేదని సిద్ధాంతులు స్పష్టం చేస్తున్నారు.
ఆ తర్వాత వచ్చే శ్రావణ మాసంలోనే మళ్లీ పెళ్లిళ్లకు, ఇతర విశేష కార్యక్రమాలకు అవకాశాలు ఉంటాయి. తక్కువ ముహూర్తాలు ఉండడం, ఆ తర్వాత చాలా రోజుల పాటు గ్యాప్ రావడం తో ఒక్కసారిగా పెళ్లి పనులు ఊపందుకున్నాయి. ఎక్కడ చూసినా కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు అన్నీ ముందే బుక్ అయిపోయాయి. క్యాటరింగ్ సర్వీసుల వాళ్లకు చాలా డిమాండ్ పెరిగింది.ఇది మాత్రమే కాకుండా, పెళ్లి షాపింగ్ వల్ల బంగారం దుకాణాలు, పట్టు బట్టల షాపులు, మరియు ఇతర డెకరేషన్ వ్యాపారాలు చాలా జోరుగా కొనసాగుతున్నాయి. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో వ్యాపారులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మొత్తం మీద, ఈ తక్కువ రోజుల్లోనే శుభకార్యాలు ముగించుకోవడానికి ప్రజలు పోటీ పడుతున్నారు. లేదా, శ్రావణ మాసం వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే!