Wednesday, 03 June 2026
SWASTHIK NEWS
Home / తెలంగాణ

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం: కొత్త పార్టీని ప్రకటించిన కల్వకుంట్ల కవిత

25 Apr 2026
10:24 AM
7,165

స్వస్తిక్ న్యూస్, తెలంగాణ :-  రాజకీయ ముఖచిత్రంపై మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఊహాగానాలకు తెరదించుతూ.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునిరాబాద్ వేదికగా శనివారం (ఏప్రిల్ 25న) జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె తన కొత్త పార్టీ పేరును ప్రకటించి రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించారు. 

తన కొత్త పార్టీకి 'టీఆర్ఎస్' (తెలంగాణ రాష్ట్ర సేన) అని నామకరణం చేసినట్లు కవిత సభాముఖంగా వెల్లడించారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి, సెంటిమెంట్‌కు మారుపేరుగా నిలిచిన టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పేరును బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి)గా మార్చిన విషయం తెలిసిందే. జాతీయ రాజకీయాల కోసం 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, తెలంగాణలో ఆ పేరు కోల్పోయిన సెంటిమెంట్‌ను తిరిగి రగిలించే వ్యూహంతోనే కవిత తెలివిగా తన పార్టీకి 'తెలంగాణ రాష్ట్ర సేన' (TRS) అనే పేరును ఎంచుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

హోరెత్తిన సభా ప్రాంగణం.. 'సీఎం కవిత' అంటూ నినాదాలు:

మేడ్చల్ సభకు తెలంగాణ నలుమూలల నుంచి జాగృతి కార్యకర్తలు, కవిత అభిమానులు, యువత భారీ సంఖ్యలో తరలివచ్చారు. బతుకమ్మలు, ఎడ్ల బండ్లతో భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. కవిత తన పార్టీ పేరును ప్రకటించగానే సభా ప్రాంగణం మార్మోగిపోయింది. కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున "సీఎం కవిత.. సీఎం కవిత" అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా తాము కవిత వెంటే నడుస్తామని కార్యకర్తలు నినదించారు.కొద్దిసేపట్లో జెండా ఆవిష్కరణ:కొత్త పార్టీ పేరును ప్రకటించిన కవిత, మరికాసేపట్లో పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ జెండాలో తెలంగాణ సంస్కృతి, ఉద్యమ స్ఫూర్తి ఉట్టిపడేలా రంగులు, చిహ్నాలు ఉండబోతున్నట్లు సమాచారం. జెండా ఆవిష్కరణ అనంతరం పార్టీ విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణ, ఎజెండాపై కవిత స్పష్టత ఇవ్వనున్నారు.

తెలంగాణ జాగృతి ద్వారా దశాబ్ద కాలానికి పైగా బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసి, మహిళలు, యువతలో బలమైన ముద్ర వేసిన కవిత.. పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తితో గత ఏడాది (సెప్టెంబర్ 2025లో) బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి విదితమే. నాయకత్వ మార్పు, పార్టీ విధానాలపై తండ్రి కేసీఆర్‌తో విభేదించిన ఆమె.. తెలంగాణ అస్తిత్వాన్ని, సెంటిమెంట్‌ను తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దృఢ నిశ్చయంతో ఇప్పుడు "తెలంగాణ రాష్ట్ర సేన"ను బరిలోకి దించారు.

 

Swasthik News

Share this Article

T.VENGAL REDDY

Author

CEO & FOUNDER (swasthik news)
𝗦𝗥. 𝗝𝗢𝗨𝗥𝗡𝗟𝗜𝗦𝗧 𝗔𝗡𝗗 𝗪𝗥𝗜𝗧𝗘𝗥

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates