స్వస్తిక్ న్యూస్,ఆంధ్ర ప్రదేశ్ :- గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ "బిల్ గేట్స్" ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టారు. రాష్ట్ర నూతన రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్ గేట్స్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సహా ముఖ్య నాయకులందరూ కూడా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు.


గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా వారందరూ కలిసి అమరావతిలోని సచివాలయానికి చేరుకున్నారు. ఇక బిల్ గేట్స్ ఫౌండేషన్కు చెందినటువంటి ఆరుగురు ప్రజాప్రతినిధుల బృందం ఇప్పుడు సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ తో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా బిల్ గేట్స్ సచివాలయంలో ఉన్నటువంటి రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాన్ని సందర్శిస్తారు. ఈ రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం సాధిస్తున్నటువంటి కొన్ని కొత్త ఫలితాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ కు స్వయంగా వివరించనున్నారు.

ఈ కార్యక్రమం అనంతరం వివిధ శాఖలకు సంబంధించి ప్రాజెక్టుల విస్తరణ పై కీలక చర్చలు జరపనున్నారు. ఇక స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలను కూడా ఈ కార్యక్రమంలో భాగంగానే పూర్తిగా వివరించనున్నారు. మరి ముఖ్యంగా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కొనసాగుతున్నటువంటి సంజీవని ప్రాజెక్ట్, మెడ్ టెక్, డయాగ్నస్టిక్స్ సేవల విస్తరణ పై ఈ భేటీలో కీలక చర్చలు జరపనున్నారు. ఇక సచివాలయ కార్యక్రమం పూర్తయిన తరువాత బిల్ గేట్స్ బృందం ఉండవల్లి లోని ఒక వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తుందని సమాచారం. అక్కడ సాగులో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) మరియు డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నటువంటి తీరును బిల్గేట్స్ ప్రత్యక్షంగా తిలకిస్తారు. ఇక అనంతరం తిరిగి బిల్ గేట్స్ వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయి.
