స్వస్తిక్ న్యూస్,అమరావతి :- ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) లో జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. రాజధానిపై YCP నేతలు చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలు పార్టీ శ్రేణుల్లోనే కాకుండా, ప్రజల్లోనూ తీవ్ర గందరగోళానికి కారణమవుతున్నాయి.2024 ఎన్నికల సమయంలో 'మూడు రాజధానుల' నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన YCP, ఆ ఎన్నికల్లో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత రాజధాని విషయంలో ఆ పార్టీ వ్యూహాలు రోజుకో మలుపు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. మొదట అమరావతిని కాదని 'మూడు రాజధానుల' పేరుతో ఎన్నికలకు వెళ్లిన ఆ పార్టీ, ఓటమి తర్వాత 'మావిగన్' (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) అనే కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.

జగన్ ప్రకటనల పరంపర :- మాజీ ముఖ్యమంత్రి, YCP అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా 'మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు' లను రాజధానిగా పేర్కొనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. అయితే, ఈ ప్రకటనపై పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పందిస్తూ, అది ప్రభుత్వానికి జగన్ చేసిన సూచన మాత్రమేనని సవరణ ఇచ్చారు.ఇంతటితో ఈ గందరగోళం ఆగలేదు. నిన్నటి వరకు 'మావిగన్' తోనే భవిష్యత్తు ఎన్నికలకు వెళ్తామని ప్రకటించిన జగన్, అనూహ్యంగా ఈరోజు విజయవాడే రాష్ట్ర రాజధాని అని స్పష్టం చేశారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే జగన్ తన వైఖరిని మార్చుకోవడం రాజకీయ వర్గాల్లో విస్మయానికి గురిచేసింది.

YCPలో ఏం జరుగుతోంది?... రాజధాని లాంటి అత్యంత కీలకమైన అంశంపై అధినేత జగన్ సహా పార్టీ ముఖ్య నేతలు ఎవరికి తోచినట్లు వారు ప్రకటనలు చేయడం, తరువాత వాటిని మార్చుకోవడం పట్ల "YCPలో అసలు ఏం జరుగుతోంది?" అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజధాని విషయంలో ఆ పార్టీకి స్పష్టమైన విధానం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ పరిణామాలు YCP లోని అంతర్గత విభేదాలకు అద్దం పడుతున్నాయని, నాయకుల మధ్య సమన్వయం లోపించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజధానిపై నిలకడ లేని వైఖరితో ప్రజల్లో ఆ పార్టీ విశ్వసనీయత కోల్పోయే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఈ అంశంపై YCP ఎలాంటి స్పష్టత ఇస్తుందో వేచి చూడాలి.