స్వస్తిక్ న్యూస్, ఆన్లైన్ డెస్క్ :- ప్రముఖ షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా (49) హార్ట్ స్టెంట్ అమర్చుకున్న కొద్ది రోజులకే అకాల మరణం చెందడం అందరినీ కలచివేసింది. అయితే, ఈ విషాద ఘటన ఇప్పుడు వైద్య వర్గాల్లో, సాధారణ ప్రజల్లో ఒక కొత్త చర్చకు దారి తీసింది.
ప్రాణాలు కాపాడాల్సిన హార్ట్ స్టెంట్లు ఫెయిల్ అవుతున్నాయా?... అసలు స్టెంట్ వేసుకున్న తర్వాత కూడా గుండెపోటు ఎందుకు వస్తోంది? అన్న ప్రశ్నలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి.స్టెంట్ అంటే ఏమిటి?గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ధమనుల్లో పూడికలు ఏర్పడి మూసుకుపోయినప్పుడు, రక్త ప్రసరణను తిరిగి సాఫీగా చేయడానికి ఆ ధమనిలోకి చొప్పించే ఒక చిన్న గొట్టాన్నే 'స్టెంట్' (Stent) అని అంటారు. హృద్రోగ సమస్యలతో బాధపడేవారికి ఇది తక్షణ ఉపశమనం కలిగించి ప్రాణాలు నిలబెడుతుంది.వైద్యులు ఏమంటున్నారు?స్టెంట్ల పనితీరుపై వస్తున్న అనుమానాలపై వైద్య నిపుణులు స్పందిస్తున్నారు.
సాధారణంగా హార్ట్ స్టెంట్లు సురక్షితమైనవేనని వారు స్పష్టం చేస్తున్నారు. ఇవి విఫలమయ్యే (ఫెయిల్ అయ్యే) అవకాశాలు చాలా అరుదుగా మాత్రమే ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో స్టెంట్లు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉందని, ప్రధానంగా రెండు కారణాల వల్ల మళ్లీ గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు వివరిస్తున్నారు.
రీస్టెనోసిస్ :- అమర్చిన స్టెంట్ లోపల తిరిగి కణజాలం పెరగడం. దీనివల్ల తెరుచుకున్న రక్తనాళం మళ్లీ సన్నబడి రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది.
థ్రాంబోసిస్ :- స్టెంట్ వేసిన ప్రాంతంలో రక్తం గడ్డకట్టడం. ఇది రక్త సరఫరాను పూర్తిగా నిలిపివేసి అకస్మాత్తుగా గుండెపోటుకు దారి తీస్తుంది.చాలా వరకు స్టెంట్లు సురక్షితమే అయినప్పటికీ, స్టెంట్ అమర్చుకున్న తర్వాత రోగులు వైద్యుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు, మందులు వాడటం ఎంతో అవసరమని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.