స్వస్తిక్ న్యూస్,త్రిపురాంతకం :- మార్కాపురం జిల్లా, త్రిపురాంతకం మండలంలో శనివారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం పురస్కరించుకొని ప్రముఖ సాహితీవేత్త, శ్రీశ్రీ కళావేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కుల నాసరయ్య తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు, శ్రీరంగం శ్రీనివాసరావు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి ప్రధాన విభాగం యునెస్కో 1999లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రకటించింది. నాటి పాకిస్థాన్ లో బెంగాలీలు 1952లో తమ మాతృభాష బెంగాలీ పరిరక్షణ కోసం చేసిన పోరాటానికి గుర్తుగా బంగ్లాదేశ్ ప్రతిపాదన మేరకు ఈ తేదీ ఖరారైంది. యునెస్కో విద్యాబోధనలో కనీసం మూడు భాషలు,మాతృభాష, జాతీయ భాష, అంతర్జాతీయ భాషలకు చోటుండాలని 1999 నుంచి ప్రచారం చేయడం ఆరంభించింది. పిల్లలు పసిప్రాయంలో మాతృభాష తరువాత మిగిలిన రెండు భాషలు నేర్చుకుంటే వారి జీవితం సాఫీగా సాగిపోతుందని పై ప్రతిపాదన చేసింది.
చిన్న పిల్లల మానసిక ఆరోగ్యానికి వారి మాతృభాషతో సంబంధం ఉందని పరిశోధకులు తేల్చారు. పుట్టిన దగ్గర్నుంచి మాతృభాష ధ్వనులు వింటుండటం వల్ల వారిపై ప్రభావం చూపుతాయి. మాతృభాషలో మాట్లాడలేని పిల్లల్లో చురుకుదనం తక్కువగా ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అమ్మపాలు, అమ్మభాషలకు ఏవీ సాటిరావు. ఎదుగుదలకు అభివృద్ధికి మాతృభాష ఎంతగానో తోడ్పడుతుంది. గ్లోబలైజేషన్ నేపథ్యంలో కొన్ని భాషలకే అధిక ప్రాధాన్యం లభిస్తుండటం వలన రాబోయే కాలంలో వందలాది భాషల ఉనికి అంతరించిపోయే ప్రమాదం కనబడుతోంది. గనుక మనందరం మన మాతృభాష ఉనికిని మనం కాపాడుకోవాలి. మన భాషా సంస్కృతి వారసత్వాన్ని నిలబెట్టుకునేందుకు మనలో ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి. మన మాతృభాషను మరచిపోతే మన కన్నతల్లిని మరచినట్లే. ఈరోజుల్లో ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం ఇతర రాష్ట్రాలలో, విదేశాల్లో స్థిరపడిపోతున్నారు. పిల్లలు తమ మాతృభాషకు దూరమవుతున్నారు. మనమే మన పిల్లలకు చిన్నతనం నుంచే మన మాతృభాష మాధుర్యం మమకారం వారికి చెబుతుండాలి, రాయడం, చదవడం నేర్పించాలి. ఆధునిక నాగరికత మోజులో పడిపోయి మన మాతృభాషను నిర్లక్ష్యం చేయడం తగదు. యునెస్కో కూడా ఇదే సూచిస్తోంది. మన మాతృభాషను కాపాడుకోవలసిన బాధ్యత మనదేనని తెలిపారు.