స్వస్తిక్ న్యూస్, జాతీయం:- ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాలను భూప్రకంపనలు వణికించాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా భూమి కంపించడంతో సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణభయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.వివరాల్లోకి వెళితే..శనివారం రాత్రి సరిగ్గా 11.32 గంటల సమయంలో ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో భూమి కంపించింది. దీని ప్రభావం ప్రధానంగా ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్పష్టంగా కనిపించింది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు, అరకులోయ తదితర ప్రాంతాల్లో వరుసగా 10 సెకన్లకు పైగానే ఈ భూప్రకంపనలు వచ్చాయి.
ఉలిక్కిపడిన జనం..అర్ధరాత్రి సమయం కావడంతో ఆ ప్రాంతాల ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా భారీ శబ్దాలతో ఇళ్లు ఊగిపోవడం, భూమి కంపించడంతో జనం హడలిపోయారు. ఏంజరుగుతుందో అర్థంకాక, భూకంపం అని గ్రహించి వెంటనే ఇళ్లలో నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ ప్రకంపనల తీవ్రతకు పలు ఇళ్లలో బీరువాలు, వంటగదిలోని సామాన్లు, ఇతర వస్తువులు కింద పడిపోయాయి. దీంతో ప్రజలు మరింత భయభ్రాంతులకు లోనయ్యారు. ఎప్పుడు మళ్లీ ప్రకంపనలు వస్తాయోనన్న భయంతో రాత్రంతా కంటిమీద కునుకు లేకుండారు.ఒడిశాలో భూకంప కేంద్రం..ఈ భూప్రకంపనలకు సంబంధించి, ఒడిశా రాష్ట్రంలోని 'సునాబెడ' ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడ ఏర్పడిన కదలికల వల్లే ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో ఈ స్థాయిలో ప్రభావం కనిపించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం లేదు.