స్వస్తిక్ న్యూస్,అమరావతి :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకస్మాత్తుగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఇంధనం లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పెట్రోల్ బంకుల ముందు 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తున్నాయి. బంకులు మూతపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే రంగంలోకి దిగారు.
రాష్ట్రంలో నెలకొన్న ఇంధన కొరత, ప్రజల ఇబ్బందులపై సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు రోడ్లపైన, బంకుల వద్ద పడిగాపులు పడకుండా చూడాలని, తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అధికారులను గట్టిగా ఆదేశించారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో (HPCL, BPCL, IOCL) సమన్వయం చేసుకుని ఇంధన సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని స్పష్టం చేశారు.
ఈ సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించారు. వాస్తవానికి నిల్వల కొరత కంటే, ప్రజల్లో నెలకొన్న ఆందోళన (పానిక్ బయింగ్) వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్పష్టం చేశారు. ఏదో జరగబోతోందన్న పుకార్ల నేపథ్యంతో.. వాహనదారులు ఒక్కసారిగా బంకులకు పోటెత్తారు. దీనివల్ల పెట్రోల్, డీజిల్‌కు సాధారణం కంటే ఒక్కసారిగా 50 శాతానికి పైగా డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోయిందని అధికారులు సీఎంకు వివరించారు. అవసరానికి మించి ట్యాంకులు ఫుల్ చేయించుకోవడం వల్లే బంకుల్లో స్టాక్ వేగంగా ఖాళీ అయిపోయిందని పేర్కొన్నారు.
ఒక్కసారిగా పెరిగిన ఈ 50 శాతం అదనపు డిమాండ్‌ను తట్టుకోలేక సరఫరా వ్యవస్థలో అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. దీని పర్యవసానంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 400 వరకు పెట్రోల్ బంకులు ఇంధనం లేక మూతపడినట్లు గణాంకాలతో సహా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
ఈ నివేదికను పరిశీలించిన సీఎం చంద్రబాబు.. సరఫరాను వేగవంతం చేసేందుకు అదనపు ట్యాంకర్లను నడపాలని సూచించారు. అలాగే, రాష్ట్రంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని (పానిక్ కావొద్దని) ప్రభుత్వం తరఫున విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితి త్వరలోనే పూర్తిగా అదుపులోకి వస్తుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.