స్వస్తిక్ న్యూస్, మార్కాపురం :-
»అణగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక బాబాసాహెబ్: యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు
»ఘనంగా జరిగిన విగ్రహావిష్కరణ కార్యక్రమం
»హాజరైన కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, రాష్ట్ర హోం మంత్రి అనిత, సామాజిక సంక్షేమ శాఖ మంత్రి బాలవీరాంజనేయ స్వామి
కనిగిరి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక శాసనసభ్యులు శ్రీ ముక్కు ఉగ్రనరసింహ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ చారిత్రాత్మక మహోత్సవంలో యర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు పాల్గొని ప్రత్యేక శ్రద్ధాంజలి ఘటించి, ప్రసంగించారు.

ఈ సందర్భంగా గూడూరి ఎరిక్షన్ బాబు గారు మాట్లాడుతూ.. సమాజంలో అణగారిన, బలహీన వర్గాల అభ్యున్నతికి, ఆత్మగౌరవానికి అంబేద్కర్ గారు చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. సామాజిక న్యాయం, సమానత్వం, విద్య, స్వేచ్ఛ, మరియు సోదరభావం లాంటి గొప్ప విలువలను దేశ ప్రజలందరికీ అందించడానికి ఆయన తన జీవితాన్ని ధారపోశారని గుర్తుచేశారు.ప్రతి భారతీయుడికి సమాన హక్కులు కల్పిస్తూ, బలమైన రాజ్యాంగాన్ని దేశానికి అందించిన దార్శనికుడు బాబాసాహెబ్ అని శ్లాఘించారు. "చదువుకోండి, సంఘటితమవండి, పోరాడండి" అనే అంబేద్కర్ గారి అమూల్యమైన సందేశం నేటి యువత ప్రగతికి, సమాజ చైతన్యానికి నిజమైన స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను నిజం చేయడమే మనం ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తరలివచ్చిన ప్రముఖులు.. రాజకీయ కోలాహలం
ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి దేశ, రాష్ట్ర స్థాయి ముఖ్యాతిథులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ చిరాగ్ పాశ్వాన్ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.వీరితో పాటు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ బి.ఎన్. విజయ్ కుమార్, గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి , OUDA చైర్మన్ శ్రీ షేక్ రియాజ్ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీమతి ముప్పవరపు వీరయ్య ఈ వేదికను అలంకరించారు.స్థానిక ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ ఉత్సవానికి నియోజకవర్గ నలుమూలల నుండి భారీ సంఖ్యలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.