స్వస్తిక్ న్యూస్, సినిమా :- బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీశ్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ 'రామాయణ' సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భారీ ప్రాజెక్టు కోసం ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 10 వేల మందికి పైగా పనిచేస్తున్నట్లు సరికొత్త సమాచారం బయటకు వచ్చింది. ఒక భారతీయ సినిమా కోసం ఇంత పెద్ద సంఖ్యలో సాంకేతిక నిపుణులు, సిబ్బంది పాలుపంచుకోవడం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదే తొలిసారి అని తెలుస్తోంది.
భారీ తారాగణం.. రికార్డు స్థాయి బడ్జెట్.. ఈ పాన్ ఇండియా చిత్రంలో సీతారాములుగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్నారు. ఇక ప్రతినాయకుడు రావణాసురుడిగా కేజీఎఫ్ ఫేమ్ 'యశ్' కనిపించనున్నారు. ఈ సినిమా నిర్మాణ విలువల విషయంలో మేకర్స్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని సమాచారం. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ. 4 వేల కోట్లు అని అంచనా వేస్తున్నారు.
విడుదల ఎప్పుడంటే..?ఈ విజువల్ ఎపిక్‌ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అందులో తొలి భాగాన్ని (పార్ట్-1) ఈ ఏడాది దీపావళి పండుగ కానుకగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా.. రెండో భాగాన్ని (పార్ట్-2) 2027 దీపావళికి తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి.మొత్తానికి భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని మునుపెన్నడూ చూడని రీతిలో, కనీవినీ ఎరుగని కాన్వాస్‌పై నితీశ్ తివారీ ఆవిష్కరిస్తున్నారని ఈ తాజా సమాచారంతో స్పష్టమవుతోంది.