స్వస్తిక్ న్యూస్,హైదరాబాద్ :- కేంద్ర ప్రభుత్వం వడ్లు (ధాన్యం) కొనుగోలు చేయకపోతే కేంద్ర మంత్రులను రాష్ట్ర పొలిమేరలు దాటనివ్వబోమంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సీఎం వ్యాఖ్యలకు ఆయన దీటుగా బదులిచ్చారు. తనను ఆపేవారు ఈ గడ్డపై ఇంకా పుట్టలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు భయపడటానికి తాను కేసీఆర్‌ను కాదని ఆయన తేల్చి చెప్పారు. త్వరలోనే కాంగ్రెస్ (INC) పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తారని, ఆ పార్టీకి దేశంలో అడ్రస్ లేకుండా చేస్తారని ఆయన జోస్యం చెప్పారు. అంతేకాకుండా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కలలో కూడా దేశ ప్రధానమంత్రి కాలేరని కిషన్ రెడ్డి విమర్శించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పాలనపై, సీఎం రేవంత్ రెడ్డి పనితీరుపై కిషన్ రెడ్డి సెటైర్లు వేశారు. "రేవంత్ రెడ్డి గారి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ, ఆయన చేతలు మాత్రం కనీసం సెక్రటేరియట్ గోడలు కూడా దాటడం లేదు" అని తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు.