స్వస్తిక్ న్యూస్, ఆంధ్ర ప్రదేశ్ :- వాహనదారులకు మళ్లీ బ్యాడ్ న్యూస్, నాలుగు రోజుల్లోనే రెండోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు. అంతర్జాతీయ ఉద్రిక్తతలే దీనికి కారణమని చెప్తున్నారు. ఇక బండ్లు పక్కన పెట్టి నడక సాగించాల్సిందేనా? జీతాలు పెరగడం లేదు కానీ.. పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం రాకెట్‌లా దూసుకుపోతున్నాయి. బండి తీసి రోడ్డెక్కాలంటేనే భయమేస్తోంది" అని సగటు వాహనదారుడు వాపోతున్నాడు. ఇంధన ధరల పెరుగుదల వల్ల రవాణా ఛార్జీలు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాహనదారుల జేబులకు చమురు సంస్థలు గట్టి చిల్లు పెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మంటలు రేపుతుండటంతో.. దేశీయంగా ఇంధన ధరల భారం సామాన్యుడిపై పడుతోంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే చమురు కంపెనీలు ధరలను పెంచడం ఇది రెండోసారి కావడంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. మే 15న లీటర్‌పై ఏకంగా రూ. 3 పెంచిన చమురు కంపెనీలు, తాజాగా (మే 19) మరోసారి లీటరుకు 90 పైసల వరకు (పెట్రోల్‌పై 86 పైసలు, డీజిల్‌పై 83 పైసలు) ధరలను పెంచాయి. అంతర్జాతీయంగా పశ్చిమాసియా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు సరఫరాపై తీవ్ర ఒత్తిడి పడింది. కీలకమైన సముద్ర వాణిజ్య మార్గమైన హోర్ముజ్ జలసంధి గుండా రవాణాకు అంతరాయం కలగడం వల్ల గ్లోబల్ మార్కెట్‌లో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్ల పైనే కొనసాగుతోంది. ఈ నష్టాలను అధిగమించడానికి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ధరలను పెంచక తప్పలేదని తెలుస్తోంది.