స్వస్తిక్ న్యూస్, ఆంధ్ర ప్రదేశ్ :- ధోని తన రిటైర్మెంట్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, తాజా పరిస్థితులు, నిన్నటి మ్యాచ్ దృశ్యాలను బట్టి ఆయన ఐపీఎల్‌కు సైలెంట్‌గా గుడ్ బై చెప్పేశారనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. మే 18న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడింది. ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై హోమ్ గ్రౌండ్‌లో సీఎస్‌కేకు ఇదే చివరి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ధోని ఆడతారని ఫ్యాన్స్ ఆశించారు, కానీ పిక్క కండరాల గాయం (Calf Strain) కారణంగా ఆయన తుది జట్టులోకి రాలేదు. నిజానికి ఈ 2026 సీజన్‌లో ఆయన ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని మైదానంలోకి వచ్చి అభిమానులకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. మైదానంలోని గ్రౌండ్ స్టాఫ్, కెమెరామెన్లతో ప్రత్యేకంగా ఫోటోలు దిగారు. తన పాత మిత్రుడు సురేష్ రైనాని ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ఈ దృశ్యాలు చూశాక, ఇది ధోనికి చెపాక్ మైదానంలో చివరి రోజని, ఆయన వీడ్కోలు దాదాపు ఖాయమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.
2021 ఐపీఎల్ టైటిల్ గెలిచినప్పుడు ధోని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నా కెరీర్‌లో చివరి టీ20 మ్యాచ్‌ను చెన్నై (చెపాక్) వేదికగానే ఆడాలని ఆశిస్తున్నా. అది వచ్చే ఏడాదో లేక ఐదేళ్ల తర్వాతో నాకు తెలియదు" అని అన్నారు. సరిగ్గా ఆ మాట అన్న ఐదేళ్లకు (2026లో) చెపాక్‌లో సీఎస్‌కే చివరి మ్యాచ్ ముగియడం, అదే సమయంలో ధోని వీడ్కోలు సంకేతాలు ఇవ్వడంతో ఆనాటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఐపీఎల్ 2026 లీగ్ దశలో సీఎస్‌కే ఆడబోయే చివరి మ్యాచ్ కోసం ధోని అహ్మదాబాద్ ప్రయాణం కావడం లేదు. ఆయన చెన్నైలోనే ఉండిపోయారు. దీంతో సన్‌రైజర్స్‌తో మ్యాచ్ రోజే ఆయన చెపాక్ వేదికగా తన ఐపీఎల్ ప్రయాణానికి తెరదించారని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ధోని ఎప్పుడూ తన రిటైర్మెంట్ నిర్ణయాలను ఎలాంటి హడావుడి లేకుండా, సైలెంట్‌గా ప్రకటిస్తుంటారు (గతంలో అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా ఇలాగే వీడ్కోలు పలికారు). మేనేజ్‌మెంట్ కానీ, ధోని కానీ ఇంకా ప్రెస్ నోట్ విడుదల చేయనప్పటికీ.. 44 ఏళ్ల 'తలా' ఐపీఎల్ కెరీర్ నిన్నటి చెపాక్ వేడుకతో ముగిసిందనేది దాదాపు స్పష్టమైంది.