స్వస్తిక్ న్యూస్,పుల్లలచెరువు :- మార్కాపురం జిల్లా, యర్రగొండపాలెం నియోజకవర్గం, నల్లమల అటవీ ప్రాంతంలో మమేకమై ఉన్న మారుమూల ప్రాంతం పుల్లలచెరువు మండలం. సరైన రవాణా సౌకర్యాలు కూడా లేని ఈ మండలంలోని మర్రివేముల గ్రామ పంచాయతీ పరిధిలోని 'ఎం. ఎర్రబాలెం' దళితవాడలో గత నెల రోజులుగా ప్రజలు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల చొరవ దళితులకు కాస్త ఉపశమనం కలిగిస్తోంది.
గ్రామస్తుల ఇబ్బందులను గమనించిన స్థానిక పంచాయతీ సెక్రటరీ తన పరిధిమేర, శాయశక్తులా తాగునీటి సమస్యను తీర్చేందుకు కృషి చేశారు. చెడిపోయిన డీప్ బోర్లను బాగుచేయించడంతో పాటు, గ్రామానికి దగ్గరలో ఉన్న వ్యవసాయ భూముల బోర్ల నుండి పైపుల ద్వారా నీటిని తెప్పించి దళితుల దాహం తీర్చారు. అయితే, రానురాను ఎండల తీవ్రతకు సమస్య మరింత జటిలం కావడంతో ఈ విషయాన్ని ప్రత్యేక అధికారి (స్పెషల్ ఆఫీసర్) నాగుల్ మీరా దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన, బుధవారం సుమారు రూ. 5 లక్షల ఖర్చుతో డీప్ బోర్‌ను ఏర్పాటు చేసి, పైప్‌లైన్ ద్వారా గ్రామానికంతటికీ తాగునీటి సరఫరా చేసే పనులను ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
అడుగంటిన భూగర్భ జలాలు:- వర్షాభావ పరిస్థితుల వల్ల మండలంలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. పుల్లలచెరువు మండలంలో ఒక్క మానేపల్లి, ఐటివరం గ్రామ పంచాయతీలు మినహా మిగతా దాదాపు అన్ని గ్రామాల్లోనూ డీప్ బోర్లు వట్టిపోయి తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది.
నిరుపయోగంగా రూ. 20 కోట్ల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్:-పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామం మీదుగా నాగార్జున సాగర్ ప్రధాన కాలువ వెళ్తున్నప్పటికీ స్థానికులకు నిరాశే మిగులుతోంది. ఈ కాలువను వనరుగా భావించి సుమారు 20 సంవత్సరాల క్రితం నియోజకవర్గంలోని 53 గ్రామాలకు (పుల్లలచెరువు మండలంలో 48, యర్రగొండపాలెం మండలంలో 3, త్రిపురాంతకం మండలంలో 2) తాగునీరు అందించేందుకు అప్పటి అధికారులు ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఈ 'సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్' నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.అప్పట్లో సుమారు రూ. 20 కోట్ల భారీ వ్యయంతో దీనిని నిర్మించినప్పటికీ.. నేటికీ ఏ ఒక్క గ్రామానికీ చుక్క తాగునీరు కూడా రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల, పాలకుల నిర్లక్ష్యంపై జనం దుమ్మెత్తిపోస్తున్నారు.
పాలకులకు ప్రజల విజ్ఞప్తి:- ప్రస్తుతం నియోజకవర్గంలో ఒక్క త్రిపురాంతకం మండలం మినహా మిగిలిన నాలుగు మండలాల్లో తాగునీటి సమస్య ప్రజలను పట్టి పీడిస్తోంది. దాహార్తితో జనం తల్లడిల్లిపోతూ తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు తక్షణమే స్పందించి నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.