స్వస్తిక్ న్యూస్, ఆంధ్ర ప్రదేశ్ :- తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి పాఠశాలల సమయాలను తగ్గిస్తూ ఒంటిపూట బడులను ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలన్నింటిలో ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో విద్యార్థులు తీవ్రమైన మధ్యాహ్న ఎండలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ తెలిపింది.

అదేవిధంగా తెలంగాణలో కూడా పాఠశాలల సమయాల్లో మార్పులు అమలు చేయనున్నారు. అక్కడ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు కొనసాగనున్నాయి. పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించి, అనంతరం వారిని ఇంటికి పంపించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించారు. వేసవి వేడి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం తీసుకున్నదిగా ప్రభుత్వం పేర్కొంది.