స్వస్తిక్ న్యూస్,ఆంధ్రప్రదేశ్ :- మధ్యాహ్న బడి భోజనంపై విద్యాశాఖాధికారులతో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఫోన్లో సమీక్ష నిర్వహించారు. భోజనం సిద్ధం అయ్యాక ప్రతీరోజూ ముందుగా ఒక టీచర్ నాణ్యత చూడాలని, బాగుందని నిర్ధారించాకే విద్యార్థులకు వడ్డించాలని సూచించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ వ్యవస్థ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు. వారంలో ఒకరోజు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో ఏదో ఒక స్కూలుకి వెళ్లి మధ్యాహ్న భోజనం పిల్లలతో కలిసి తినాలని కోరారు. తల్లిదండ్రులు లీప్ యాప్ ద్వారా ఫిర్యాదులు, ఫీడ్ బ్యాక్ అందించాలని విజ్ఞప్తి చేశారు. అపర అన్నపూర్ణమ్మ డొక్కాసీతమ్మ పేరుతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో ఏ చిన్న నిర్లక్ష్యాన్ని క్షమించేది లేదని తేల్చి చెప్పారు. ఎవరైనా వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం పథకంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తే కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
