స్వస్తిక్ న్యూస్, తమిళనాడు :- తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్‌పై కరూర్ తొక్కిసలాట బాధితులు ప్రశంసలు కురిపిస్తున్నారు. విజయ్ సీఎం అయిన సందర్భంగా.. గతంలో కరూర్ ఘటనలో తమ బిడ్డను కోల్పోయిన ఓ బాధిత కుటుంబంతో ప్రముఖ వార్తా సంస్థ 'బీబీసీ' (BBC) ప్రత్యేకంగా మాట్లాడింది. ఈ ఇంటర్వ్యూలో ఆ కుటుంబం పలు భావోద్వేగ విషయాలను పంచుకుంది.తమ బిడ్డ మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న తమను విజయ్ స్వయంగా పరామర్శించారని బాలిక తల్లిదండ్రులు తెలిపారు. మరణించిన బాలిక తల్లి మాట్లాడుతూ.. "విజయ్ గారు నేరుగా మా ఇంటికి వచ్చారు.. ఏకంగా నా కాళ్లపై పడ్డారు" అని ఎంతో ఉద్వేగంగా వెల్లడించారు. ఆ ఘోర ఘటన జరిగిన తర్వాత ఆయన తమ కుటుంబానికి ఎంతగానో అండగా నిలిచారని వారు కృతజ్ఞతలు తెలిపారు.రాజకీయాల్లో మార్పు రావాలన్న ఉద్దేశ్యంతోనే తాము ఈ ఎన్నికల్లో విజయ్‌కు ఓటు వేశామని సదరు కుటుంబం స్పష్టం చేసింది. తాము ఆశించిన ఆ మార్పు నిజంగా జరిగినప్పుడు తాము మనస్ఫూర్తిగా సంతోషిస్తామని వారు పేర్కొన్నారు.
ఘటన నేపథ్యం: గత ఏడాది సెప్టెంబర్ నెలలో కరూర్‌లో విజయ్ నిర్వహించిన ఓ భారీ రాజకీయ సభలో ఊహించని విధంగా తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషాదకర ఘటనలో సుమారు 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అప్పుడు బాధితులకు అండగా నిలిచిన తీరు, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కావడంతో మరోసారి చర్చకు వచ్చింది.