పల్నాడు జిల్లా, అడిగొప్పల గ్రామం :- మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలంలోని అడిగొప్పల గ్రామంలో వెలసినటువంటి శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి జాతరకు ముహూర్తం ఖరారు అయింది. ఆదివారం శ్రీనిదానంపాటి లక్ష్మీ అమ్మవారి ఆలయంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేష నాయుడు మరియు యాగంటి వంశస్తుల సమక్షంలో చర్చించి జాతర తేదీని నిర్ణయించారు. మార్చి 8వ తేదీన అడిగొప్పుల శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి జాతర నిర్వహించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు.

తేదీ ఖరారు అవడంతో ఈ ఉత్సవం భారీ స్థాయిలో నిర్వహించేలా ఆలయ అధికారులు ఇప్పటినుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాతరకు ఆలయాన్ని రూపుదిద్దుతున్నారు. అడిగొప్పుల లో జరిగే నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి జాతర ప్రతి ఏడాది కూడా చాలా ఘనంగా జరుగుతుండడంతో ఈ ఏడాది కూడా అంతే ఘనంగా జరిగే విధంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే మొదలుపెట్టారు.

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశాలు ఉండడంతో సౌకర్యాల కల్పన కోసం ఏర్పాట్లు ముమ్మరం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ జాతరలో భాగంగానే అడిగొప్పుల గ్రామం నుంచి కుంకుమ బండ్లు కట్టి అమ్మవారి ఆలయానికి తీసుకువస్తుంటారు. ఇవే ఈ జాతరకు హైలెట్ కానున్నాయి.



శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి చరిత్ర :-
పల్నాడు జిల్లా, దుర్గి మండలం అడగొప్పుల గ్రామ సమీపంలోని నిదానంపాటి అగ్రహారం లో యాగంటి రామయ్య, సుగుణమ్మ దంపతులకు అమ్మవారి జన్మించారు. ఆమెకు మూర్తయ్య, వెంకయ్య, నరసయ్య మరియు లింగయ్య అనే నలుగురు అన్నలు ఉండేవారు. పురాణాల ప్రకారం ఆమె ఒకసారి పవిత్రమైన గోవును పూజించి.. గోపంచకాన్ని స్వీకరించడం వల్ల ఆమె గర్భాన్ని దాల్చారు. దీనిని తప్పుగా అర్థం చేసుకున్నటువంటి గ్రామస్తులు మరియు ఆమె అన్నలు ఆమెని నిందించారు. చివరికి ఇక చంపేయాలని నిర్ణయించుకుంటారు. ఇక ఆమె కూడా తన పవిత్రతను నిరూపించుకోవడానికి అగ్ని ప్రవేశం చేశారు. ఆ సమయంలో ఆమె గర్భం నుండి ఒక ఆవు దూడ బయటకు వచ్చి మంటల్లో కాలిపోయింది అని.. అది చూసిన అన్నలు పశ్చాతాపంతో మరణించారు అని పురాణాలు చెబుతున్నాయి.

అడిగోప్పల ఆలయంలో శ్రీనిదానంపాటి లక్ష్మీ అమ్మవారు 11 ఏళ్ల బాలిక రూపంలో దర్శనం ఇస్తారు. ఈ ఆలయానికి పైకప్పు అనేది ఉండదు. అమ్మవారు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉండాలి అని కోరుకోవడం వల్లనే ఆలయ మధ్యభాగం ఖాళీగా ఉంచబడింది. ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తులు అమ్మవారికి పొంగలి మరియు పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. 15వ శతాబ్దం నాటి చరిత్ర కలిగిన ఈ క్షేత్రంలో వేప చెట్టును మరియు ఒక శిలను పవిత్రంగా భావించి ఇక్కడ ఇక్కడ అమ్మవారిని పూజిస్తారు.

